- నిజాం ప్రపంచ ధనికుడు.. ప్రజలు మాత్రం నిరుపేదలు
- మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన పోరాట చరిత్రకు జాతీయ స్థాయిలో దక్కిన అధికారిక గుర్తింపు బీజేపీ దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితమేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. 1998 నుంచి తమ పార్టీ చేపట్టిన ఉద్యమాల కారణంగానే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను హైదరాబాద్ లిబరేషన్ డేగా అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన కమిటీ–బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచనం–జాతీయవాదుల పాత్ర అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మేధావుల సదస్సులో మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన పోరాటంలో జాతీయవాద సంస్థలు పోషించిన పాత్ర అద్భుతమైందన్నారు.
నిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత సంపన్న పాలకుడిగా గుర్తింపు పొందినా.. ఆయన పాలనలో సామాన్య తెలంగాణ ప్రజలు తీవ్ర పేదరికం, వెట్టిచాకిరి, నిలువు దోపిడీకి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల విముక్తి దినమని, ఓట్ల కోసం, ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి చరిత్రను వక్రీకరించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. పరకాల, బైరాన్‌పల్లి దమనకాండలు నిజాం రజాకార్ల కిరాతక పాలనకు రక్తసాక్ష్యాలని పేర్కొన్నారు. కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర నేతలు గౌతమ్ రావు, అశోక్, బంగారు శృతి, ప్రకాష్ రెడ్డి, కప్పర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
